మొన్నటి ఎన్నికల(Assembly Elections) టైమ్ లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బే పెద్దమొత్తంలో పట్టుబడింది. అదేదో పక్కాగా ప్లాన్ వేసినట్లు.. ఉన్నది ఉన్నట్లు, చూసింది చూసినట్లన్న రీతిలో నేరుగా(Direct) దాడులకు దిగడం, అక్కడ డబ్బు ప్రత్యక్షం కావడం, వాటిని సీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి. పోలీసులు ఇంత పక్కాగా ప్లాన్ చేస్తున్నారా అన్నట్లు దాడులు జరిగాయి. కానీ దీని వెనుక వేరే మర్మం(Secret) దాగుంది. ఆ సీక్రెటే తాజాగా బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం.
రిమాండ్ రిపోర్టులో…
ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, BJP సీనియర్ నేత రఘునందన్ రావు, మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు బడా వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, నగదు ఉన్న చోట దాడులకు దిగడం చేశాయి ప్రత్యేక టీంలు. ఈ విషయాలన్నీ రిమాండ్ రిపోర్టులో బయటపడ్డాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో A-4గా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ అధికారి రాధాకిషన్ రావు స్వయంగా చెప్పిన విషయాలివి. రఘునందన్ రావుతోపాటు ఆయన బంధువుల ఇళ్ల నుంచి భారీగా డబ్బు సీజ్ చేసినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టు బయటపెట్టింది.
దుబ్బాక బై ఎలక్షన్స్ లో…
దుబ్బాక ఉప ఎన్నికల్లో కోటి రూపాయల్ని సీజ్ చేయగా… మునుగోడు బై ఎలక్షన్లలోనూ రూ.3.5 కోట్లు పట్టుకున్నారు. ఈ దాడుల కోసమే ప్రత్యేకంగా టీమ్ లు ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలియజేశారు. SIB చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. అటు రాజకీయ నేతలే కాకుండా వ్యాపారులనూ ఇదే విధంగా బెదిరించారు. సిమెంట్ కంపెనీ ఓనర్ ఆనంద్ ప్రసాద్ కు చెందిన రూ.70 లక్షలను పట్టుకుని సీజ్ చేశారు.