ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు(Additional) ఎస్పీలకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆ ఇద్దరు అధికారుల్ని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. ASPలు భుజంగరావు, తిరుపతన్న పోలీసు కస్టడీ ముగియడంతో వారిద్దరికీ గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు(Medical Tests) నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులకు ఈ నెల 6 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.
ముగిసిన కస్టడీ…
గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ముదిరి(Serious) పాకాన పడింది. DSP ప్రణీత్ రావు ఆధ్వర్యంలో సాగిన ట్యాపింగ్ లో టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ రావు, భూపాలపల్లి ASP భుజంగరావు, హైదరాబాద్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ SP తిరుపతన్నలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగుర్నీ అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్నారు. రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు.
మళ్లీ కస్టడీ కోరుతూ…
రాధాకిషన్ రావు నుంచి కీలక విషయాలు రిమాండ్ రిపోర్టుతో వెలుగులోకి రావడంతో ఆయన్ను మరో 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ మరోసారి పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. రాధాకిషన్ రావును మరింత లోతుగా(In Depth) విచారించాల్సిన అవసరం ఉన్నందున నిందితుణ్ని తమకు అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.