కొద్దిసేపట్లో తెల్లవారుతుందనే టైమ్(Early Hours) లో బస్సును ఒక పక్కకు ఆపారు. అప్పటికే బాగా జర్నీ చేయాల్సి రావడంతో కొద్ది సేపు ఆగి రెస్ట్ తీసుకోవాలనుకున్నారు. ఆ బస్సు నిండా ప్రయాణికులు(Passengers) ఉండగా.. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి ఒక వాహనం వెనుక నుంచి వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న చాలా మంది కళ్లు తెరవకుండానే కన్ను మూశారు. ఇదీ రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం. ఆగి ఉన్న బస్సును ట్రాలీతో కూడిన వెహికిల్ ఢీకొట్టిన ఘోర దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ భరత్ పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గుజరాత్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని మథురకు బస్సు వెళ్తున్న సమయంలో జయపుర-ఆగ్రా హైవేపై అంత్రా వద్ద యాక్సిడెంట్ జరిగింది. లఖ్నపూర్ ఏరియాలో అంత్రా ఫ్లైఓవర్ వద్ద ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన వ్యాను వేగంగా ఢీకొట్టింది. చనిపోయిన 11 మందిలో ఆరుగురు మహిళలున్నట్లు భరత్ పూర్ SP మృదుల్ కచవా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. మృతదేహాలను, గాయాల పాలైన వారిని హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.