పశు సంవర్ధక శాఖలో ఇంతకాలం జరిగిన అక్రమాలు(Frauds) ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే గొర్రెల పంపిణీ(Sheeps Distribution)లో భారీగా అవకతవకలు బయటపడి నలుగురు ఉన్నతాధికారులు ఊచలు లెక్కబెడుతుండగా.. అలాంటి కుంభకోణమే మరొకటి బయటపడింది. దీనిపై స్వయంగా కొంతమంది రైతులే అవినీతి నిరోధకశాఖ(ACB)ని ఆశ్రయించడంతో అసలు తతంగం వెలుగులోకి వచ్చింది.
పథకం ఇది…
2022 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఒక్కో యూనిట్ కు రూ.70,000 చొప్పున తొలి దశలో మొత్తం 1,200 యూనిట్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రైతుల వద్ద ఆవుల్ని కొనుగోలు చేశారు. అయితే వారి అకౌంట్లలో డబ్బులు వేసేందుకు రూ.8.4 కోట్లను అప్పటి సర్కారు విడుదల చేసింది. అయితే ఈ నిధుల్ని రైతుల అకౌంట్లలో జమ చేయకుండా పక్కదారి పట్టించారని అర్థమైంది.
ఎంతమేరకు హాంఫట్…
సర్కారు రిలీజ్ చేసిన రూ.8.4 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లకు పైగా స్వాహా చేశారని ACB గుర్తించినట్లు కనపడుతున్నది. రైతులు నేరుగా ACB డీజీకే కంప్లయింట్ ఇవ్వడంతో ఆయన ఈ కుంభకోణంపై సీరియస్ గా దృష్టిపెట్టారు. జగిత్యాల, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సిద్దిపేట తదితర జిల్లాల్లో లబ్ధిదారుల్ని గుర్తించగా.. ఆవుల్ని వారికి పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులోనూ గొర్రెల స్కాం మాదిరిగానే తతంగాన్ని మధ్యవర్తి నడిపాడని ACB అనుమానిస్తున్నది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు(Investigation) నిర్వహించేలా టీమ్ లను ఏర్పాటు చేస్తున్నది.
గొర్రెల స్కామ్ ఇదే…
మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ ADలు రవికుమార్, కేశవ్.. సయ్యద్ మొయిద్ అనే కాంట్రాక్టర్ తో కలిసి 2023 ఆగస్టులో APలోని ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 18 మంది రైతుల వద్ద గొర్రెలు కొన్నారు. 20 గొర్రెలు, 1 పొట్టేలు కలిపి యూనిట్ గా మొత్తంగా 133 యూనిట్లు కొనుగోలు చేశారు. అమ్మిన రైతుల ఆధార్, పాన్ కార్డులతోపాటు బ్యాంక్ అకౌంట్ నంబర్లను తీసుకున్న అధికారులు… నగదును మాత్రం వారికి ట్రాన్స్ ఫర్ చేయలేదు. ఆ పనిని కాంట్రాక్టర్ అయిన మొయిద్ కు అప్పగించారు. అతను అసలు రైతుల స్థానంలో బినామీల పేర్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశాడు. దీంతో పశుసంవర్ధక నుంచి డబ్బులు ఆ బినామీల అకౌంట్లలోకి చేరిపోయాయి.
గొర్రెలు తీసుకెళ్లి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో రైతులంతా హైదరాబాద్ కొండాపూర్ లోని సయ్యద్ మొయిద్ ఆఫీసుకు వెళ్లారు. సర్కారు నుంచి డబ్బులు రాలేదని నమ్మించాలని చూసినా… రైతులంతా నేరుగా పశుసంవర్ధక శాఖ ఆఫీసుకు వెళ్లారు. దీంతో నగదు దారి మళ్లించిన విషయం తెలుసుకుని దీనిపై 2023 డిసెంబరు 20న గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఈ ఘటనలో వెటర్నరీ ఆసుపత్రి AD రవి, పశుసంవర్ధక శాఖ AD ఆదిత్య, భూగర్భ జల(Ground Water) అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యుటీ డైరెక్టర్ గణేశ్ అరెస్టయ్యారు. ఈ కాంట్రాక్టరే ఇప్పుడు ఆవుల స్కామ్ లోనూ ఉన్నట్లు గుర్తించారు ACB అధికారులు.