ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 విమానాశ్రయాల(Airports)కు బాంబు బెదిరింపులు(Bomb Threats) రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అన్ని చోట్లా భద్రతా బలగాలన్నీ బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకూ బెదిరింపు రావడంతో.. దుబాయ్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం రెండు గంటలు ఆలస్యంగా చేరుకోవాల్సి వచ్చింది.
ఈ-మెయిల్స్ తో…
దీనిపై ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తమై(Alert) నిందితుల కోసం వేట సాగించింది. మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్స్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో అన్ని ఎయిర్ పోర్టులకు రావాల్సిన, వెళ్లాల్సిన ఫ్లైట్లు లేటయ్యాయి. పట్నా(Patna), కోయంబత్తూర్(Coimbatore), వడోదర, జైపూర్, చెన్నైతోపాటు అన్ని మేజర్ ఎయిర్ పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
హైసెక్యూరిటీ…
‘మేం అక్కడ బాంబు పెట్టాం.. ఏ క్షణమైనా పేల్చేస్తాం..’ అంటూ దుండగుడు ఈ-మెయిల్స్ పంపించాడు. దీంతో CISF(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్), BDDS(బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్), స్నిఫర్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించి హై అలర్ట్ ప్రకటించారు.