ఆమె పేరు మంజుల.. తెలిసిన వ్యక్తికి అప్పు ఇవ్వడమే ఆమె పాలిట శాపమైంది. అప్పు ఇవ్వాల్సిన వ్యక్తి తిరిగి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఏకంగా హత్యకు పాల్పడింది. అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో శుక్రవారం జరగ్గా… సంచలనంగా మారిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. రిజ్వానా బేగం(29) గతంలో మంజుల వద్ద రూ. లక్ష అప్పుగా తీసుకుంది. అడిగినప్పుడల్లా ఇస్తానని చెప్పింది. అప్పుకు బాండ్ కూడా రాసి ఇస్తానని నమ్మించింది. ఒత్తిడి తట్టుకోలేక చివరకు మంజులను హత్య చేయాలని చూసింది. అనుకున్నట్లుగానే మంజులను ఇంటికి రప్పించుకున్న రిజ్వానా.. ప్లాన్ ప్రకారం మంజుల కళ్లల్లో కారం కొట్టింది. అనంతరం చీర కొంగును మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసిందని శంషాబాద్ DCP నారాయణరెడ్డి తెలిపారు.
మృతదేహం వద్ద మెడికల్ స్లిప్, తాళం చెవి దొరికిందని వాటి ఆధారంగా కేసును ఛేదించినట్లు DCP తెలియజేశారు. మంజులను హత్య చేసిన తర్వాత మెడలో ఉన్న పుస్తెల తాడు, చెయిన్, చెవిపోగులు తీసుకుని దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు వెల్లడించారు. రిజ్వానా బేగంను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అప్పు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా ఎదుటి వారి గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.