ఆయనో సబ్ ఇన్స్ పెక్టర్.. నేరస్థుల్ని పట్టుకోవాల్సిన బాధ్యతల్లో ఉన్న ఆయన.. తానే నిందితుడిగా మారిపోయాడు. డ్రగ్స్ కేసులో సొంత డిపార్ట్ మెంట్ అధికారినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న SI రాజేందర్ ను మత్తు పదార్థాల కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
గతంలో వాటిని పట్టుకున్న సందర్భంలో చేతివాటం ప్రదర్శించారని అధికారులకు అనుమానం కలిగింది. పట్టుబడ్డ మత్తు పదార్థాల్లో కొన్ని కనిపించకుండా పోయాయని వాటిని సదరు SIయే మాయం చేశారన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ నిర్వహించారు. అయితే డ్రగ్స్ దాచిపెట్టిన విషయం ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. దీంతో వారి ఆదేశాల మేరకు SI రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ ఇంటికి
డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేందర్ తోపాటు కొంతమంది టీమ్ మహారాష్ట్రకు వెళ్లింది. అక్కడ నిందితుడి నుంచి వాటిని స్వాధీనం(Recovery) చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే పట్టుకున్న మత్తు పదార్థాల్లో కొన్ని కనపడకపోవడంతో మిగతా టీమ్ లోని పోలీసులకు అనుమానం వచ్చింది. జరిగిన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. SI వ్యవహారాలపై నిఘా పెట్టారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి విచారణ మొదలు పెట్టాక.. ఆయన ఇంట్లోనే కొన్ని డ్రగ్స్ ఉన్నాయని తేల్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మంచి ఫిజిక్ కోసం జిమ్ లో ఎస్ఐ ఎక్కువగా గడుపుతాడని గుర్తించారు. అవి నిజంగానే అమ్మడానికి దాచిపెట్టుకున్నాడా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ సాగుతోంది.
గతంలోనూ ACB కేసులో సస్పెండ్
గతంలోనూ ఈ ఎస్ఐ ACBకి దొరికిపోయాడు. ప్రొబెషన్ పీరియడ్ లోనే అవినీతికి పాల్పడ్డాడని రాజేందర్ ను సర్వీస్ నుంచి రీమూవ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ ఆర్డర్స్ పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ కేసు అలా ఉండగానే ఇప్పుడు మరో కేసులోనూ అరెస్టయ్యారు. అయితే మళ్లీ సైబరాబాద్ పరిధిలోనే… ఈసారి NDPS యాక్ట్ కేసులో అరెస్టు కావడం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.