కట్టుకున్న ఇల్లాలితో కడవరకు తోడుంటానని వేలు పట్టి నడిచిన ఆ వ్యక్తి.. చివరకు తన అర్థాంగినే పొట్టనబెట్టుకోవాలని చూశాడు. భార్య గర్భవతి అని కూడా చూడకుండా మానవత్వం(Humanity) లేని ఆ భర్త పిస్తోల్(Service Revolver) తో కాల్చాడు. ఎవరో సాధారణ వ్యక్తులు ఈ పని చేశారనుకోవచ్చు. కానీ సాక్షాత్తూ ప్రజల్ని రక్షించాల్సిన పోలీసు అధికారి అయి ఉండి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన ఘటనలో అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. శశాంక్ మిశ్రా అనే సబ్ ఇన్స్ పెక్టర్(Sub-Inspector).. నెలన్నర గర్భవతిగా ఉన్న తన సతీమణిపై సర్వీసు రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రెండు బుల్లెట్లు ఆమె చేతిలోకి దూసుకెళ్తే.. మరో బుల్లెట్ కడుపులో తాకింది. వెంటనే బాధితురాలిని ట్రీట్మెంట్ కోసం దగ్గర్లోని మెడికల్ కాలేజీకి తరలించారు. సదరు SIని డ్యూటీ నుంచి తొలగించి కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు.
అదనపు కట్నం కోసమే ఘాతుకం
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కట్నం కోసమే SI వేధిస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఝాన్సీ జిల్లాలోని ఉల్దాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో పనిచేస్తున్న శశాంక్ మిశ్రా.. తరచూగా వేధింపులకు గురి చేస్తున్నాడని, కట్నం తేవాలని డిమాండ్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీనిపై లోతుగా ఇంటరాగేషన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఝాన్సీలో ఉంటున్న తన తల్లి, సోదరుడిని కలిసేందుకు ఆదివారం నాడు వెళ్లిన శశాంక్.. అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక భార్యతో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఆమె ఎంత చెబుతున్నా వినకుండా కోపం పట్టలేక సర్వీస్ రివాల్వర్ తో కాల్పులు జరిపినట్లు బాధితురాలు తెలిపింది. ఒక బాధ్యతాయుత హోదాలో ఉండి కట్నం కోసం భార్యపైనే కాల్పులు జరిపిన ఆ SI.. సమాజమే సిగ్గుతో తలవంచుకునే విధంగా వ్యవహరించడం అందరినీ ఆవేదనకు గురిచేసింది.