మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. తాజాగా మరో మైనర్ ను అదుపులోకి తీసుకోవడంతో వారి సంఖ్య ఆరుకు చేరిందని ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. దేశ ప్రధాని, సుప్రీంకోర్టు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించడంతో నిందితుల వేటను వేగవంతం చేసిన బీరేన్ సింగ్ సర్కారు.. ప్రధాన నిందితుడు సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకుంది.
జాతి ఘర్షణలకు నిలయంగా మారిన మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొంతమంది పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మే 4న జరిగిందని ఆ రాష్ట్రానికి చెందిన ఇండిజీనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం(ITLF) తెలిపింది. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి పంట పొలాల్లో సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.