Published 25 Dec 2023
బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు కేసులో అరెస్టుల సంఖ్య భారీగా ఉంటోంది. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని రిమాండ్ కు తరలించగా.. తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసి ఇప్పటికే జైలుకు తరలించగా, ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ దాడి ఘటన వెనకున్న వారిని గుర్తిస్తున్న పోలీసులు కంటిన్యూగా అరెస్టులు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన అవినాశ్ రెడ్డి, యూసుఫ్ గూడకు చెందిన సుధాకర్ తోపాటు పవన్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 24కు చేరుకుంది. పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయగా, అతడు ఈ నెల 23న విడుదలయ్యాడు. A1గా ప్రశాంత్, A2గా అతడి తమ్ముడు నాలుగు రోజుల పాటు జైలులో ఉన్నారు.
బిగ్ బాస్-7 షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ జరిగి ఆర్టీసు బస్సులతోపాటు పోలీసు వాహనం అద్దాలు పగులగొట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ కాగా.. ప్రశాంత్ తోపాటు ఆయన తమ్ముడు మహవీర్ ను గజ్వేల్ మండలం కొల్గూరులోని వారి ఇంటిలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు.. CC ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అటు పల్లవి ప్రశాంత్ బెయిలు వచ్చి బయటకు రాగా, ఈ దాడి కేసులో మరికొందరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.