ఉన్నత చదువుల కోసమని వెళ్లిన విద్యార్థులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేపుతున్నాయి. పీయూసీ ఫస్టియర్ చదువుతున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన లిఖిత(17) విగతజీవిగా మారింది. హాస్టల్లో ఉంటున్న ఈ విద్యార్థిని బుధవారం అర్థరాత్రి రెండింటి సమయంలో నాలుగో అంతస్తు నుంచి కిందపడింది. భద్రతా సిబ్బంది గమనించి వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించాక భైంసా ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అక్కణ్నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇది ప్రమాదమా, ఆత్మహత్యనా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బజ్జీల బండి నడుపుతూ కూతురు ఉన్నత చదువుల కోసం ట్రిపుల్ ఐటీలో చేర్పిస్తే అఘాయిత్యం జరిగిపోయిందని ఆమె తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
రెండ్రోజుల క్రితమే దీపిక ఆత్మహత్య
ఫస్టియర్ చదువుతున్న మరో విద్యార్థిని దీపిక ఆత్మహత్యకు పాల్పడి రెండ్రోజుల అయిందో లేదో ఇప్పుడు ఇంకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం చూస్తే.. ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్ కు చెందిన దీపిక.. బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యార్థినిని గుర్తించి భైంసా దవాఖానాకు తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ వరుస ఘటనలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంప్రదించారు. దీపిక మృతిపై ఇప్పటికే కమిటీ వేసి విచారణ చేస్తున్నామని.. లిఖిత మృతిపై వైస్ ఛాన్సలర్ నుంచి పూర్తి సమాచారం అందాక వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే విద్యార్థుల వరుస మరణాలపై విపక్షాలు, విద్యార్థి సంఘాలు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
పేద కుటుంబాల పిల్లలే ఎక్కువ
ప్రభుత్వ ట్రిపుల్ ఐటీలో చదివే వారిలో 99 శాతానికి పైగా పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ఉంటారు. టెన్త్ లో మండల స్థాయిలో టాపర్లుగా నిలిచే విద్యార్థులే ఇంజినీరింగ్ కోసం వస్తారు. తల్లిదండ్రుల కష్టాలను తొలగించాలంటే తాము బాగా చదివి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలన్న లక్ష్యంతోనే అందులో చేరతారు. కొన్ని నెలల క్రితం భోజనం సరిగా లేక విద్యార్థులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఒకపూట తిండి, మరోపూట ఎండి అయినా బాధ బయటకు తెలియకుండా చదువులు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనిపిస్తున్న వరుస మరణాలు ట్రిపుల్ ఐటీ ప్రాంగణాన్ని అయోమయంగా మారుస్తున్నాయి.