ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా లోన్ యాప్(Loan App) నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. తాజాగా సింగరేణికి చెందిన ఉద్యోగి.. దారుణమైన వేధింపుల(Harrassment)తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్ ల ద్వారా ఎక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చి వాటిని కట్టించుకోవడానికి నానా హింసలు పెడుతూ, బెదిరిస్తూ అందినంత దండుకుంటున్నారు దుండగులు. ఇలాంటి అచేతనావస్థలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సింగరేణి ఉద్యోగి వంశీకృష్ణ(27).. ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆన్ లైన్ ద్వారా లోన్ తీసుకున్న వంశీకృష్ణ.. ఇప్పటికే రూ.2.5 లక్షలు చెల్లించాడు. ఇంకా బాకీ ఉన్నవి చెల్లించాలంటూ విపరీతమై ప్రెజర్ తేవడంతో వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డట్లు పెద్దపల్లి పోలీసులు తెలిపారు. ఈజీ మనీ కోసం ఇలాంటి లోన్ యాప్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించవద్దని సూచిస్తున్నారు. లోన్లు తీసుకున్నప్పుడే పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇచ్చిన వివరాలతోనే బ్లాక్ మెయిల్ చేస్తూ వడ్డీలను ఇష్టమొచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు.
అక్రమ లోన్ యాప్ లపై నడుం బిగించిన కేంద్రం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో గతంలోనే కమిటీ ఏర్పాటు చేసింది. ఇల్లీగల్ యాప్ లపై నిషేధం విధిస్తూ ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. లీగల్ యాప్ లు మాత్రమే స్టోర్లలో ఉండేలా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇంత కట్టడి చేస్తున్నా లోన్ యాప్ ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ ఇల్లీగల్ దందా వల్ల చైనాకు రూ.5,000 కోట్ల దాకా కోల్పోవాల్సి వచ్చిందని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు.