యోగా గురువు బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తమ ఆదేశాల్నే ధిక్కరిస్తారా అంటూ గట్టిగా మందలించింది. పతంజలి అడ్వర్టయిజ్మెంట్(Ads) కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్నే వీరు పట్టించుకోలేదు. దీంతో ధిక్కరణ కేసులో పతంజలి తరఫున రాందేవ్ బాబా, సంస్థ MD బాలకృష్ణ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. తాము చేసిన తప్పిదంపై ఈ ఇద్దరూ క్షమాపణలు చెప్పారు.
మీరు అమాయకులా…
‘మీరు మంచి కార్యక్రమాలు చేస్తుంటారు.. కానీ అలోపతి(Allopathy)ని కించపరచకూడదు… మీరు అమాయకులేం కాదు.. మా ఉత్తర్వుల్నే పట్టించుకోరా.. చేసిన తప్పుకు మీరు పబ్లిక్ గా సమాధానం చెప్పాలి..’ అంటూ న్యాయమూర్తులు మండిపడ్డారు. ఉత్తర్వుల్ని ఉల్లంఘించడం మా అభిమతం కాదంటూ రాందేవ్, బాలకృష్ణ స్వయంగా చెప్పినా బెంచ్ వదిలిపెట్టలేదు.
మోసగించి…
యాడ్స్ కేసులో ప్రజలను మోసగించినందున వారికే క్షమాపణలు చెప్పేందుకు వారం గడువిస్తూ కేసును ఈ నెల 23కు వాయిదా వేసింది. సుప్రీం ఆర్డర్స్ ని పట్టించుకోనందుకు రాందేవ్, బాలకృష్ణకు కోర్టు వారం క్రితం నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు క్షమాపణగా వీరిద్దరూ అఫిడవిట్ సమర్పిస్తే… దాన్ని బెంచ్ కొట్టేసి కోర్టు ఎదుట అటెండ్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం విషయంలో రాజీపడేది లేదన్న వార్నింగ్ తో ఈ ఇద్దరూ బెంచ్ ముందుకు వచ్చారు.
కేసు ఇది…
అస్తమా, గుండె జబ్బుల్ని పూర్తిగా నయం చేస్తామంటూ తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇస్తున్నారంటూ పిటిషన్ దాఖలైంది. కోర్టు వార్నింగ్ తో అలాంటి యాడ్స్ ఇవ్వబోమంటూ పతంజలి హామీ ఇచ్చింది. కానీ మాట మరిచి మెడిసిన్ పై ప్రకటనలు కంటిన్యూ చేసింది. ఆయుర్వేద యాడ్స్ పై 2023లోనూ సుప్రీం మండిపడింది.
కేవలం క్షమాపణ చెప్పి ఇద్దరూ తప్పించుకోలేరని ఘాటైన కామెంట్స్ చేసింది. సమాజాన్ని మోసం చేసినట్లు కోర్టును తప్పుదోవ పట్టించలేరని గుర్తు చేసింది. చట్టాలను రాందేవ్, బాలకృష్ణ ఉల్లంఘించారని జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య బెంచ్ తేల్చింది.