దేశంలో సంచలనమైన ‘సందేశ్ ఖాలి’ అరాచకాలపై CBI జరుపుతున్న విచారణను ఆపాలంటూ మమతా బెనర్జీ సర్కారు పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయింది. విచారణను వెనకేసుకొస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిందితుల్ని కాపాడేందుకు ఎందుకు మీకంత శ్రద్ధ అంటూ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య(Devision) బెంచ్ మండిపడింది. దారుణాలకు పాల్పడ్డ షాజహాన్ ను ఫిబ్రవరిలో CBI అరెస్టు చేయగా.. అతణ్ని TMC ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. రేషన్ స్కామ్ సహా షాజహాన్ పై 42 కేసుల్లో విచారణ సాగుతున్నది.
ఈ దర్యాప్తును ఆపేయాలంటూ సుప్రీంలో మమత సర్కారు పిటిషన్ వేసింది. ఒక వ్యక్తి కోసం ప్రభుత్వం పిటిషన్ వేయడమేంటని సీరియస్ కావడంతోపాటు హైకోర్టు ఆదేశాల్ని సమర్థించడంతో పిటిషన్ వెనక్కు తీసుకుంది పశ్చిమబెంగాల్ సర్కారు.
అసలు కథ ఇది…
పశ్చిమబెంగాల్ ఉత్తర 24 పరగణ జిల్లాలోని ‘సందేశ్ ఖాలి’లో.. తృణమూల్ కాంగ్రెస్(TMC) నేత షాజహాన్ షేక్, అతడి అనుచరులు మహిళలపై లైంగిక హింసకు పాల్పడి భూముల్ని లాక్కోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఆ అకృత్యాలపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలంటూ కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలు కాగా.. CBI దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. షాజహాన్ బృందాన్ని పట్టుకునేందుకు వెళ్లిన CBI అధికారులపై దాడులు కూడా జరిగాయి.