మీరు ఒక రాష్ట్రానికి మంత్రి(Minister)..
కీలక స్థానంలో ఉండి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు..
కేసులు ఫైల్ అయితే చివరకు తమను రక్షించాలంటూ కోర్టుకు వస్తారు..
ఇదే నా మీ పద్ధతి.. అంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది.
ఇదీ… తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కోప్పడ్డ తీరు. సామాజిక న్యాయం, సమానత్వానికి దూరంగా ఉన్నందున సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ హిందూ ధర్మంపై వ్యతిరేక కామెంట్స్ చేశారు స్టాలిన్. దేశంలో నమోదైన కేసుల నుంచి తనను రక్షించాలంటూ సుప్రీంలో ఇంతకుముందే పిటిషన్ వేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం(Devision Bench).. ఈ కేసును ఈరోజు విచారించిన సమయంలో ఉదయనిధికి వార్నింగ్ ఇచ్చింది.
మీరు మినిస్టరేనా…
మీరు మినిస్టర్ అన్న విషయం గుర్తుంచుకోలేదా అని స్టాలిన్ పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్19(1)(a)ని దుర్భాషలాడి… ఆర్టికల్ 25ను దుర్వినియోగం చేసి… చివరకు ఆర్టికల్ 32 కింద అదే రాజ్యాంగం ఏర్పాటు చేసిన కోర్టుకు వస్తారా… మీకు మీరు నేను సామాన్య వ్యక్తని అనుకుంటున్నారా… రాష్ట్రానికి మంత్రి… రాజ్యాగం కల్పించిన హక్కులు తెలుసా… వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛను దుర్వినియోగం చేశారంటూనే కేసు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
దేశవ్యాప్తంగా కేసులు…
తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి.. సనాతన ధర్మంపై 2023 సెప్టెంబరులో చేసిన కామెంట్స్ తో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు కనిపించాయి. హిందూ వ్యతిరేకి స్టాలిన్ ను అరెస్టు చేయాలంటూ తమిళనాడు, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకల్లో పెద్దయెత్తున కేసులు నమోదయ్యాయి. అన్ని చోట్లా FIRలు నమోదు కావడంతో కేసులన్నింటిపై ఉమ్మడిగా విచారణ జరపాలంటూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు.