
అతి కిరాతకంగా దుండగులు జరిపిన దాడిలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు(Head Master) దుర్మరణం పాలయ్యారు. మారణాయుధాలతో మెడపై నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ మారోజు వెంకటాచారి(52)ని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. వెంకటాచారికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రానికి చెందిన వీరి కుటుంబం.. కొన్నేళ్లుగా నాయకన్ గూడెంలో నివాసం ఉంటున్నది. అక్కడే ప్రైవేటు స్కూల్ నడిపిన వెంకటాచారి… రెండేళ్ల క్రితం దాన్ని మూసివేసి ఆ బిల్డింగ్ ను లీజ్ కు ఇచ్చారు.
స్వతహాగా కబడ్డీ ప్లేయర్ అయిన వెంకటాచారి… ఉద్యోగం రాకముందు కుల వృత్తి చేసుకునేవారు. సర్కారీ నౌకరి రావడంతో ఖమ్మం జిల్లాలో సెటిల్ అయ్యారు. నాయకన్ గూడెం నుంచి డ్యూటీ కోసం సిరిపురం వెళ్తుండగా హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.