Published 30 Nov 2023
పోలింగ్ జరుగుతున్న రాష్ట్రంలో పోలీసుల గొడవ(Police Agitation) చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అన్ని చోట్లా ఓటింగ్ పడుతుంటే సరిహద్దు(Telangana-Andhra Pradesh Border)లో మాత్రం రెండు రాష్ట్రాల పోలీసులు ఘర్షణకు దిగారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ పోలీసులపై పొరుగు రాష్ట్రపు ఖాకీలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మన వైపు గేటు దూకి ఇక్కడి పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఫోన్లు లాక్కుని హడావుడి సృష్టించారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ను ఇరు రాష్ట్రాలు చూసుకోవాలి. అందుకే రెండు వైపులా సెక్యూరిటీ ఏర్పాటు చేసి నిరంతరం డేగ కళ్లతో కాపలా కాస్తుంటారు. అలాంటి ప్రదేశంలో రెండు రాష్ట్రాల భద్రతా సిబ్బంది గొడవకు దిగడం ఇంట్రెస్టింగ్ గా మార్చింది.
నీటి కోసం తండ్లాట
నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా నీటి విడుదల కోసం AP ప్రయత్నాలు చేస్తున్నది. అటు తెలంగాణ వైపు గల ఎడమ కాల్వకు 10 రోజుల పాటు నీటిని వదిలిన అధికారులు.. తర్వాత గేట్లు మూసేశారు. ఎన్నికల సందర్భంగా CEలు, SEలు సహా ఇతర అధికారులంతా పోలింగ్ డ్యూటీలో ఉండిపోయారు. ఇదే అదనుగా భావించిన AP పోలీసులు తెలంగాణ గేటు దూకి లోపలకు చొచ్చుకువచ్చారు. 26 గేట్లలో 13 గేటుకు వద్దకు అర్థరాత్రి పూట చేరుకుని ఇది మా భూభాగం అంటూ మధ్యలో ఫెన్సింగ్ వేశారు. తెలంగాణ పోలీసులు పెద్ద సంఖ్యలో లేకపోవడం, అటువైపు నుంచి స్థానిక పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. పోలింగ్ రోజు నాడే ఇలా జరగడంతో స్పందించేందుకు అధికారులు అందుబాటులో లేకపోయారు.