ఒక దొంగ చేసిన పనికి ఎంతో మంది అనారోగ్యం పాలవ్వాల్సి వచ్చింది. రోడ్డు మీద కనపడ్డ సిలిండర్ల వాల్వ్ ల్ని ఎత్తుకెళ్లాలని చూస్తే.. అవి లీకై పెద్ద ప్రమాదమే చోటుచేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. సనత్ నగర్ లో అమ్మోనియా గ్యాస్ లీకై 15 మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఫతేనగర్ పైపులైన్ రోడ్డు వద్ద… గ్యాస్ కంటింగ్ కు ఉపయోగించే రెండు సిలిండర్లు చాలా కాలం నుంచి అక్కడే పడి ఉన్నాయి. అటుగా వచ్చిన ఓ దొంగ… సిలిండర్లను గమనించి వాటికి ఉన్న ఇత్తడి వాల్వ్ లను తీసుకోవాలని ప్రయత్నించాడు.
సిలిండర్ కు ఉన్న వాల్వ్ ను రాడ్డుతో కొట్టి దాన్ని ఎత్తుకెళ్లాలని అనుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అందులోని అమ్మోనియా గ్యాస్ లీకయింది. గమనించిన వెంటనే ఆ దొంగ అక్కణ్నుంచి పరారీ కాగా.. లీకైన గ్యాస్ పొగలా పరిసరాల్ని చుట్టుముట్టింది. పెద్దయెత్తున పైకి చుట్టుముట్టడంతో అక్కడున్న వారు బాధితులుగా మారారు. సమీపంలోని కంపెనీలో పనిచేస్తున్న కూలీలు గ్యాస్ పీల్చి ఊపిరి ఆడకపోవడంతో.. వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. చుట్టూ ఉన్న బస్తీలోని కొందరు కళ్ల మంటలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే బాధితులందర్నీ బాలానగర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.