Published 16 Dec 2023
అతడో దొంగ. తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడుతూ స్థానికుల కంటపడి పరుగు అందుకున్నాడు. ఊరివాళ్లు వెంటపడటంతో చివరకు చెరువులోకి దూకి మధ్యలో బండరాయిపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి ఎంత బతిమిలాడినా బయటకు రాలేదు. నేను బయటకు వస్తే మీరు కొడతారు.. అందుకే నేను ఇక్కణ్నుంచి అస్సలే కదలనంటూ అదే బండరాయిపై నిలబడి ఉన్నాడు. టీవీ ఛానల్స్ తో పాటు CM రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి KCR వస్తేనే ఒడ్డుకు వస్తానని తెగేసి చెప్పాడు. ఈ ఘటన హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయనగర్ లో జరిగింది.
శివాలయనగర్ లోని ఇంట్లోకి దూరిన ఈ దొంగ.. అక్కడే కూర్చుని డబ్బులు లెక్కిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ కుటుంబానికి చెందిన బాలిక ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరువాలోని వస్తువుల్ని కిందపడి ఉన్నాయి. ఏంటా అని పరిశీలిస్తే ఇంకేముందు ఆ దొంగ కనపడ్డాడు. వెంటనే ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో భయపడి కాళ్లకు పనిచెప్పాడు. అతణ్ని పట్టుకునేందుకు చుట్టుపక్కల వాళ్లు వెంబడిస్తూనే ఉండగా ఇక దొరికిపోతానని భయపడ్డ కేటుగాడు.. వెంటనే అక్కడున్న పెద్ద చెరువులోని దూకేశాడు. చెరువు మధ్యలోనే నిలబడి ఉండిపోయాడు. స్థానిక పోలీసులు ఎంత బతిమిలాడినా అర్థరాత్రి వరకు అక్కడే నిలబడ్డాడు తప్పితే బయటకు రాలేదు. దీంతో చీకటి పడ్డ నుంచి అర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే కాపు కాశారు. చివరకు ఎలాగోలా అతణ్ని ఒడ్డుకు తీసుకురాగలిగారు. తమ ఇంట్లో నుంచి రూ.20 వేలు ఎత్తుకెళ్లాడని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు.