ఆకాశాన్నంటుతున్న టమాట ధరలు… చివరకు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పంట రేట్లు మండిపోతుండంటతో వాటిని పండించే రైతులకు రక్షణ లేకుండా పోయింది. ఇంతవరకు టమాటలు దొంగిలించిన కేసులే చూశాం… కానీ ఓ రైతు ప్రాణాలే తీసిన ఘటన తాజాగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో టమాట రైతు హత్యకు గురయ్యాడు. టమాట అమ్మిన డబ్బులు ఉంటాయన్న అనుమానంతో ఆ రైతును అడ్డుకున్న దుండగులు… దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
మదనపల్లె మండలం బోడిపల్లదిన్నెకు చెందిన ఫార్మర్ నారెం రాజశేఖర్ రెడ్డి(62) ఊరి శివారులో ఉన్న వ్యవసాయ పొలంలోనే నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి పాలు పోసేందుకు ఊరిలోకి వస్తుండగా దుండగులు అడ్డుకున్నారు. పక్కనే ఉన్న చింతచెట్టు కిందకు తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేశారు. తువాల మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసినట్లు మదనపల్లె పోలీసులు చెబుతున్నారు.