హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ORR) సర్వీసు రోడ్డులో కారు దగ్ధమైన ఇద్దరు చనిపోయిన ఘటనలో ఆశ్చర్యకర నిజాలు బయటకొచ్చాయి. అది ప్రమాదం కాదని, సూసైడ్ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సాయంత్రం జరిగిన ఈ ఘటనలో యువతి, యువకుడు సజీవ దహనమయ్యారు. కారులో మంటలు వచ్చి ప్రమాదం జరిగిందని తొలుత అనుకున్నారు. కానీ పోలీసుల ప్రాథమిక విచారణలో అది ఆత్మహత్యగా నిర్ధారణైంది. సదరు ప్రేమ జంట కారులోనే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నట్లు తేలింది. రెండు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించట్లేదన్న ఆవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బయటపెట్టిన లెటర్…
మృతిచెందిన వారిని శ్రీరాములు, లిఖితగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమ్ములపేటకు చెందిన శ్రీరాములు.. మేడ్చల్ జిల్లా నారపల్లికి చెందిన లిఖిత ప్రేమించుకుంటున్నారు. ఘట్ కేసర్ మండలం నారపల్లిలో సైకిల్ దుకాణం నడుపుతున్న శ్రీరాములుకు లిఖితతో పరిచయమైంది. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడం, అమ్మాయికి 17 ఏళ్లే ఉండటంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ విషయం బయట చెబుతానంటూ అమ్మాయి సమీప బంధువు వేధించడంతో తాము చనిపోతున్నామని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ చెప్పిన ఈ ప్రేమ జంట.. ఘటనాస్థలిలో మూడు పేజీల లెటర్ రాసి పెట్టింది. ఈ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కారుని మేడిపల్లిలోని ట్రావెల్ ఏజన్సీ వద్ద అద్దెకు తీసుకున్నారు.