ఎన్నికల కోడ్ పుణ్యమాని రాష్ట్రంలో నోట్ల కట్టలు, బంగారం గుట్టలు బయటపడుతున్నాయి. రాజధానిలో పెద్దయెత్తున హవాలా మనీ బయటపడటంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతు అయింది. మియాపూర్ లో పోలీసులు చెకింగ్(Vehicle Checking) చేస్తే బంగారం, వెండిని తీసుకెళ్తున్న వెహికిల్ పట్టుబడింది. ఇందులో 17 కిలోల బంగారం, మరో 17.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసుకున్న బంగారం, వెండిని ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు.
కోట్లకు కోట్ల మనీ తరలింపు
గాంధీనగర్ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో 2.09 కోట్లు స్వాధీనం చేసుకుని, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అటు వనస్థలిపురంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.29.40 లక్షల్ని ఎస్వోటీ(Special Operations Team) పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ లోనూ పెద్దయెత్తున వెహికిల్ చెకింగ్స్ నిర్వహించారు. అయ్యప్ప సొసైటీలో చేపట్టిన చెకింగ్స్ లో రూ.32 లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పరిధిలో మరో రూ.10 లక్షల్ని గుర్తించారు.