
చేసిన పాపం ఊరికే పోదంటారు.. కొందరికి ఆలస్యంగా తగిలితే మరికొందరికి అది వెంటనే చుట్టుకుంటుందని మరోసారి రుజువైంది. కట్టుకున్నదాన్ని చంపి పోలీసులకు లొంగిపోదామనుకున్నాడు. తండ్రి మాటలతో ఇంటికి తిరిగొస్తుండగా యాక్సిడెంట్ అయి అతడూ మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ లో జరిగింది. అక్కడి CI అశోక్ తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపకు ఆదిలాబాద్ టౌన్ శివారు బంగారుగూడకు చెందిన అరుణ్ తో మే 11న వివాహమైంది. పెళ్లయిన వారం నుంచే భార్యను అనుమానిస్తూ తరచూ గొడవపడేవాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు దీప చెప్పడంతో ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. భార్యను మంచిగా చూసుకుంటానని నమ్మించి ఆగస్టు 28న ఆమెను వెంటబెట్టుకెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున దీపతో మరోసారి గొడవపడ్డ అరుణ్.. ఆమె గొంతు నులిమి, తలను మంచానికేసి కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులకు లొంగిపోవడానికి ఆదిలాబాద్ రూరల్ PSకు బైక్ పై బయల్దేరాడు. ఇంతలో అతడి తండ్రి జైవంత్ రావు లేచి చూస్తే బైక్ కనిపించలేదు. కొడుక్కి ఫోన్ చేస్తే భార్యను చంపి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నానని చెప్పాడు. వెంటనే ఇంటికి రమ్మని తండ్రి చెప్పడంతో తిరిగి వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే అరుణ్ మృత్యువాత పడ్డాడు. తమ కోడలిని కొడుకే హత్య చేశాడని జైవంత్ రావు చెప్పడం.. దీప తల్లి కంప్లయింట్ ఇవ్వడంతో అరుణ్ తల్లిదండ్రులపై కేసు ఫైల్ చేశారు. మనసిచ్చి మనువాడిన ఇల్లాలిని మూడున్నర నెలలకే పొట్టనబెట్టుకున్న అరుణ్.. తాను చేసుకున్న పాపంతో అమాయకురాలైన భార్య వెంటే పరలోకాలకు వెళ్లిపోయాడు.