Published 21 Dec 2023
ప్రవర్తన బాగుంటే భుజం మీద నాగార్జున అయినా చెయ్యి వెయ్యొచ్చు.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిసే పోలీసు కానిస్టేబులైనా భుజం మీద చెయ్యి వెయ్యొచ్చు. అందుకే ఎవరితో చేయి వేయించుకోవాలనేది వారి వారి ప్రవర్తన(Behaviour)ను బట్టి ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా బిగ్ బాస్ విజేత విషయంలోనూ ఇదే జరిగింది. ఈ షోలో విజేతగా నిలిచి జేజేలందుకున్న యువకుడు పల్లవి ప్రశాంత్.. చివరకు కటకటాలు(Imprisonment) లెక్కపెడుతున్నాడు. అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరై సెన్సేషన్ క్రియేట్ చేసిన పల్లవి ప్రశాంత్.. ఇలా అవమానకర రీతిలో ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ, బస్సులపై దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ కాగా.. ప్రశాంత్ తోపాటు ఆయన తమ్ముడు మహవీర్ ను గజ్వేల్ మండలం కొల్గూరులోని వారి ఇంటిలో అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఈ ఇద్దర్నీ హైదరాబాద్ తరలించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ స్టేషన్ లోనే ఆరు గంటల పాటు విచారణ నిర్వహించారు.
వెలుగు నుంచి చీకట్లోకి…
బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్.. తన ప్రవర్తన కారణంగా రెండ్రోజులు కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాడు. సెలెబ్రిటీ ముసుగులో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ విచారణలో పోలీసులు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఈ ఇద్దరు అన్నదమ్ములకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలివ్వగా.. వారిద్దరినీ చంచల్ గూడకు తరలించారు. ‘అత్యుత్సాహం అసలుకే ఎసరు తెస్తుందని’… అన్నీ కలిసొచ్చాయని విర్రవీగితే జరిగే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.