అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడిలో పట్టుబడ్డ గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare) ఈఈ జగజ్జ్యోతి కేసులో.. భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. ఆమెను నిన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఈ రోజు ఆమె నివాసాల్లో పెద్దయెత్తున సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.65 లక్షలతోపాటు 2.5 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కాంట్రాక్టరు నుంచి లంచం…
బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టరు గంగన్న అనే వ్యక్తి నుంచి రూ.84 వేలు తీసుకుంటుండగా EE(Excutive Engineer) జగజ్జ్యోతిని ACB అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిస్తే, న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించారు. దీంతో నిందితురాల్ని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఇంకా ఏమైనా ఆధారాలున్నాయా అనే కోణంలో EEకి సంబంధించిన వ్యక్తులపై ACB అధికారులు నిఘా పెట్టారు.
శివబాలకృష్ణ మాదిరిగానే…
HMDA అధికారి శివబాలకృష్ణ తరహాలోనే EE జగజ్జ్యోతి విషయంలోనూ అలాంటి సోదాలే చేపడుతున్నారు ACB అధికారులు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనులు చేసుకునేందుకు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన విషయంలో మరిన్ని ఆధారాల(Proofs) కోసం పెద్దయెత్తున సోదాలు కొనసాగుతున్నాయి. శివబాలకృష్ణ కేసులో రూ.500 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఒకానొక దశలో వాటి విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగజ్జ్యోతి వ్యవహారంలోనూ ఇదే రీతిన ఇన్వెస్టిగేషన్ పై ACB దృష్టి పెట్టింది.