
Published 15 Dec 2023
సోషల్ మీడియా(Social Media)నే ఆసరాగా చేసుకుని ఫేమస్ అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక యూట్యూబ్ గురించయితే చెప్పనే అవసరం లేదు. పోస్ట్ చేస్తున్న వీడియోలతో భారీగా ఆదాయం సంపాదిస్తూనే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారుతున్నారు. చాలామంది యూట్యుబర్ల వీడియోలు చూసి ఫిదా అయిపోతున్న అమ్మాయిలు ఏకంగా వారి వలలోనే పడిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లోనూ ఇలాంటి వ్యవహారమే వెలుగు చూసింది. ప్రేమాయణం సాగించి చివరకు పెళ్లికి వచ్చేసరికి చెక్ పెట్టడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో సదరు యూట్యూబర్ పై అత్యాచారంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు.
బర్త్ డే వేడుకలకు పిలిచి
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యూట్యుబర్ చంద్రశేఖర్(చందుగాడు) ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు పోలీసులకు కంప్లయింట్ అందింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఇచ్చిన ఫిర్యాదుతో అతణ్ని రిమాండ్ కు తరలించారు. యూట్యూబ్ చందుగాడు పేరుతో పేరుపొందిన చంద్రశేఖర్ సాయికిరణ్ 2021 ఏప్రిల్ 25న బర్త్ డే వేడుకలకు యువతిని ఆహ్వానించి అత్యాచారానికి పాల్పడినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ఈ మేరకు అత్యాచారం, మోసం కింద నిందితుడిపై 420, 376(2), SC, ST అట్రాసిటీ కింద కేసులు నమోదయ్యాయి. చంద్రశేఖర్ సహా ఆయన తల్లిదండ్రులు, మరో ఇద్దరిపైనా కేసులు ఫైల్ చేశారు. ఆదాయానికి ఆదాయం, సెలెబ్రిటీ స్థాయిలో ప్రచారం ఉన్న వ్యక్తి చేసిన దుర్మార్గపు పనికి చివరకు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.