
జీడిపప్పు, బాదం, అంజీరా, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్స్ మంచి పోషకాహారాలని ఓ రీసెర్చ్ లో తేలింది. ఇవి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుమాన పడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదని.. డ్రైఫ్రూట్స్ వల్ల రాగి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి లభిస్తాయని సదరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. పప్పు గింజల్లో కొద్దిగా నూనె ఉంటుంది కానీ వాటివల్ల కొలెస్ట్రాల్ పెరగదట. అయితే వాటిని నెయ్యిలో వేయించి తింటే మాత్రం కొలెస్ట్రాల్ పెరుగుతుందని హెచ్చరించారు. పిస్తాలోని B6 విటమిన్ గుండె సమస్యలను తగ్గిస్తుండగా, రక్తనాళాలు గట్టిపడకుండా ఖర్జూరం పని చేస్తుందని గుర్తించారు. ఎండు ద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత లేకుండా చూసుకోవచ్చు.
జీడిపప్పులో కొలెస్ట్రాల్ అసలే ఉండదని, పిస్తాలోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయంటున్నారు. బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే డైజేషన్ మెరుగవుతుంది. శరీరంలో చెడు కొవ్వుని తగ్గించి మంచి కొవ్వుని పెంచే శక్తి బాదం పప్పుకు ఉందని, రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే వెయిట్ కంట్రోల్ లో ఉండటంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని కాబట్టి… డ్రై ఫ్రూట్స్ మంచి ఆహార పదార్థాలని ఆ అధ్యయనం వివరించింది.