
మహారాష్ట్ర రాజకీయాల్లో మెగా ట్విస్ట్ చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత అజిత్ పవార్… డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పవార్ తోపాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఛగన్ భుజ్ బల్, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి దిలీప్ వాల్సే పటేల్ సహా NCP నుంచి మొత్తం 9 మంది రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు. అంతకుముందు ఉన్నట్టుండి తమ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలతో అజిత్ ప్రత్యేక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ తర్వాత అజిత్ పవార్ రాజ్ భవన్ కు వెళ్లగా… CM ఏక్ నాథ్ షిండే సైతం అక్కడకు చేరుకున్నారు. అప్పట్నుంచి పవార్ టీమ్ అధికార పార్టీలో చేరుతుందన్న ప్రచారం ఊపందుకుంది.

శనివారం నాడు ముంబయిలోని తన అధికార నివాసమైన ‘దేవగిరి’లోనూ కొంతమంది పార్టీ నేతలతో పవార్ భేటీ అయ్యారు. NCP నేత ఛగన్ భుజ్ బల్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఈ మీటింగ్ లో పాల్గొనడం సంచలనానికి కారణమైంది. అయితే పుణేలో ఉన్న NCP అధ్యక్షుడు శరద్ పవార్ మాత్రం… ఆ మీటింగ్ గురించి తనకు తెలియదని చెప్పడం మెగా ట్విస్ట్ గా నిలిచింది.
రాష్ట్రంలోని మొత్తం 53 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతానికి 40 మంది అండగా ఉన్నట్లు చెబుతుండగా… అందులో 29 మంది సపోర్ట్ తో కూడిన లెటర్ ను గవర్నర్ కు అజిత్ పవార్ అందజేశారు. మరోవైపు NCP శాసనసభాపక్ష నేత పదవికి ఆయన రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ సైతం రాజ్ భవన్ లో జరిగిన ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. శాసనసభా పక్ష నేత పదవికి రిజైన్ చేస్తున్నట్లు పవార్ ప్రకటించడం, స్పీకర్ దాన్ని ఆమోదించడం, ఆ లెటర్ ను గవర్నర్ కు అందజేయడం చకచకా జరిగిపోయాయి.