
కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. బిహార్ రాజధాని పాట్నాలోని నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన ఈ భేటీలో 15 ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రస్తుత సర్కారును ఎదుర్కొనే అంశంపై చర్చ జరుపుతుండగా… ఉమ్మడిగా కలిసివెళ్తేనే అది సాధ్యమన్న భావన వ్యక్తమైంది. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గేతోపాటు అగ్రనేత రాహుల్ గాంధీ… పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా భేటీకి హాజరయ్యారు.

తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్లో అధికారం మాదే: రాహుల్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐక్యంగా ఉంటేనే బీజేపీని ఓడించగలమని, ఆ విషయంలో విజయం సాధిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ద్వేషం, హింసతో దేశాన్ని విభజిస్తూ బీజేపీ పాలన సాగుతోందని.. ఒకవైపు కాంగ్రెస్ ‘భారత్ జోడో’, మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్ ‘భారత్ టోడో’తో సిద్ధాంతాల పోరాటం జరుగుతోందన్నారు. ‘కాంగ్రెస్ డీఎన్ఏ ఉన్న బిహార్ కు అన్ని పార్టీలు వచ్చాయి.. మేము త్వరలోనే బీజేపీని ఓడించబోతున్నాం.. కర్ణాటకలో ఎన్నో మాటలు చెప్పారు.. కానీ కాంగ్రెస్ ఏకతాటిపై నిలవగానే కమలం పార్టీ కనిపించకుండా పోయింది’ అని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో అధికారం మాదే అని ప్రకటించారు.