మంచిరేవుల భూముల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీనిపై సుదీర్ఘ పోరాటం చేసిన ప్రభుత్వానికి ఊరట లభించింది. కేసును తొలుత హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించగా.. ఆ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీనిపై ప్రైవేటు వ్యక్తులంతా సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడా చుక్కెదురైంది. ఆక్రమణ(Encrochment)కు గురైన ల్యాండ్ సర్కారుకే చెందుతుందని, సదరు భూములు గ్రేహౌండ్స్ డిపార్ట్ మెంట్ వేనని తీర్పునిచ్చింది. అవి ప్రభుత్వానికి చెందిన భూములేనని, ఇకపై కింది కోర్టులకు దీనిపై జోక్యం చేసుకనే అధికారం లేదని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పింది. తమ ఆదేశాలపై ఇకపై ఎలాంటి జోక్యం చేసుకోవడానికి పర్మిషన్ లేదు అంటూ తీర్పును వెలువరించింది. తద్వారా కోట్ల విలువైన భూ వివాదానికి(Land Disputes) తెరదించింది.
కొందరు వ్యక్తులు మంచిరేవుల వద్ద 143 ఎకరాల్ని ఆక్రమించుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ భూములు తమవేనంటూ ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ల్యాండ్స్ వాళ్లకే చెందుతాయని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లింది. సింగిల్ బెంచ్ తీర్పును పక్కనపెట్టి కీలక నిర్ణయాన్ని తీసుకుంది డివిజన్ బెంచ్. దీంతో డివిజన్ బెంచ్ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court)లో సవాల్ చేశారు ప్రైవేటు వ్యక్తులు. కేసును పరిశీలించిన న్యాయస్థానం.. ప్రైవేటు వ్యక్తుల పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.