రాష్ట్రానికి చెందిన ఫారెస్ట్ మహిళా బీట్ ఆఫీసర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె అందించిన సేవల(Services)కు జాతీయస్థాయి అవార్డు సొంతమైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ A.కవిత.. నేషనల్ లెవెల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఫీల్డ్ లో అత్యున్నత సేవలు అందించినందుకు గాను కవితను ఈ అవార్డుకు కమిటీ ఎంపిక చేసింది. గ్రౌండ్ లెవెల్లో అత్యుత్తమ సేవలందించే ఫ్రంట్ లైన్(Frontline) స్టాఫ్ కు ఈ అవార్డును అందజేస్తుంటారు.
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి చేతుల మీదుగా కవిత ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఏటా నిర్వహించే గ్లోబల్ టైగర్ డే సెలెబ్రేషన్స్ సందర్భంగా ఈ అవార్డును అందజేస్తారు. అందులో భాగంగా ఈ నెల 29న ఆమె… ఉత్తరాఖండ్ లోని కార్బెట్ టైగర్ రిజర్వ్ కేంద్రం వద్ద కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డును స్వీకరించనున్నారు. కవిత ఎంపికను ధ్రువీకరిస్తూ అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ హేమంత్ సింగ్(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ-NTCA) సర్టిఫికెట్ పంపించారు. అరుదైన అవార్డుకు తెలంగాణ బీట్ ఆఫీసర్ ఎంపికవడం పట్ల ఆ శాఖ ఉద్యోగులతోపాటు అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్టు సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.