పొలిటికల్ ప్రత్యర్థి అయిన MLA సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన MLC తాటిపర్తి జీవన్ రెడ్డి అంశాన్ని.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం(High Command) చూసుకుంటున్నది. జీవన్ రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా AICC నుంచి పిలుపు వచ్చింది.
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ.. ఢిల్లీకి రావాలంటూ జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఆయన్ను హస్తినకు తీసుకురావాల్సిందిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ను ఆదేశించారు. దీంతో కాసేపట్లో ఈ MLC అధిష్ఠానం వద్దకు వెళ్లబోతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
మూడు రోజులుగా…
జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ ఈ నెల 23న రాత్రి CM చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పొద్దున వార్తల్లో చూసేవరకు తనకీ విషయం తెలియదని, 40 ఏళ్ల సీనియారిటీకి ఇచ్చే విలువ ఇదేనా అంటూ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. MLC పదవికి రాజీనామా చేస్తానని భీష్మించిన ఆయన్ను ప్రభుత్వ విప్ లతోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సముదాయించారు.
రాష్ట్రస్థాయిలో వర్కవుట్ కాకపోవడం, ఎంత చెప్పినా బెట్టు వీడక తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని జీవన్ రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడిపోయింది. ఇప్పటికే CM, డిప్యూటీ CM ఢిల్లీలోనే ఉండటం, జీవన్ రెడ్డి ఎంతకీ తగ్గకపోవడంతో ఆయన్ను ఢిల్లీ పిలిపించాలని నిర్ణయించిన హైకమాండ్.. ఆ బాధ్యతల్ని విప్ కు కట్టబెట్టింది.