మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లలో విదేశీ హస్తం ఉందని పలువురు నేతలు అంటున్నారు. హింస జరిగేలా ప్రి-ప్లాన్డ్ గా ప్లాన్ అమలు చేశారని అనుమానం వ్యక్తం చేశారు. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ మాటలు అన్నారు. మయన్మార్ తో మణిపూర్ కు సరిహద్దులున్నాయి. చైనా కూడా 400 కిలోమీటర్ల దూరంలోపే ఉంది. భద్రత తక్కువగా ఉండగా సరిహద్దులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి.. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణల్లో ఏ విషయాన్ని కొట్టిపారేయలేమని వివరించారు.
మణిపూర్ లో జరుగుతున్న హింసలో చైనా హస్తముందని బీరేన్ సింగ్ చెప్పగా… అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం అదే రీతిలో ఆరోపణలు చేశారు. కేంద్రంలో, మణిపూర్ లో బీజేపీనే అధికారంలో ఉందని, వరుసగా జరుగుతున్న అల్లర్ల ఘటనలు, హింసపై ఆ పార్టీనే జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని, అక్కడ ప్రెసిడెంట్ రూల్ అమలు చేయాలన్నారు. ‘హింసలో చైనా హస్తం ఉంది.. దానిపై మీరు ఏం చర్యలు తీసుకున్నారో వెంటనే చెప్పాల’న్నారు. 40 రోజులుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి… ప్రజలు ఇళ్లు వదిలి రిహాబిలిటేషన్ సెంటర్లలో ఉంటున్నారని, వారికోసం ఏం చేస్తున్నారంటూ రౌత్ ప్రశ్నిస్తున్నారు.
మణిపూర్ వ్యవహారాల్లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ జోక్యం చేసుకోకుండా ఉంటే ఓ పదిరోజుల్లోనే అల్లర్లు అదుపులోకి వస్తాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం అన్నారు.