పార్టీని వీడి ఏక్ నాథ్ శిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ తోపాటు మిగతా 8 మందిని డిస్ క్వాలిఫై చేయాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు NCP పిటిషన్ ఇచ్చింది. స్పీకర్ రాహుల్ నర్వేకర్ ను కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP).. పార్టీ పిరాయింపుదారుల్ని అనర్హులగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. వీరంతా మంత్రులుగా ప్రమాణం చేసిన వెంటనే NCP ప్రత్యేక మీటింగ్ పెట్టుకుంది. ఆదివారం ఉదయం జరిగిన పరిణామాలతో హడావుడిగా… అజిత్ పవార్ స్థానంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా జితేంద్ర అవధ్ ను ఎంపిక చేసింది. ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సూచనల మేరకు రాత్రికి రాత్రే స్పీకర్ ఇంటికి వెళ్లిన జితేంద్ర… ఫిరాయింపులపై స్వయంగా పిటిషన్ అందజేశారు.
మరోవైపు పార్టీ ఫిరాయించిన తొమ్మిది మందిపై అనర్హత వేటు వేయాలంటూ అటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(CEC)కి… పార్టీ చీఫ్ శరద్ పవార్ పేరుతో ఈ మెయిల్ పంపించారు. 1999లో శరద్ పవార్ స్థాపించిన పార్టీని విచ్ఛిన్నం చేసి ఆయన దగ్గరి బంధువైన అజిత్ పవార్… ఆదివారం నాడు బీజేపీ ప్రభుత్వంలో చేరారని కంప్లయింట్ లో వివరించారు. అజిత్ పవార్ వల్ల పార్టీ చీలిపోయిందని వెంటనే వారిని డిస్ క్వాలిఫై చేయాలని కోరారు.
అయితే పార్టీ వీడిన వారిని ద్రోహులుగా ఇప్పుడే చూడలేమంటూ NCP రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఆసక్తికరంగా మాట్లాడారు. ‘వారి ద్రోహం ఇంకా రుజువు కాలేదు… ఇప్పటికీ చాలామంది మాతో టచ్ లో ఉన్నారని’ చెప్పారు.