
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారు స్వేచ్ఛగా మాట్లాడే కల్చర్ ఉంటుంది. ఇక ఎలక్షన్ల టైమ్ లోనైతే టికెట్ల కోసం గాంధీభవన్ ముందు నానా హంగామా కనిపిస్తుంది. కానీ ఇకనుంచి గాంధీభవన్ వద్ద పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే వదిలిపెట్టేది లేదంటున్నారు PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గాంధీభవన్ లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు రేవంత్ గాంధీభవన్ కు వచ్చే సమయంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన కొందరు నిరసన చేస్తూ కనిపించారు. వారి వివరాలు తెలుసుకున్న రేవంత్… నిరసనలపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్ మెట్లపై ఇకనుంచి ధర్నాలు చేస్తే సస్పెండేనని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకోవాలని PCC క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి సూచించారు.
అయితే కమిటీల రిక్రూట్ మెంట్లు, ఇతర అభ్యంతరాలుంటే పార్టీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేయాలన్నారు. ఆ వినతులపై చర్చించి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. PCC ప్రెసిడెంట్ ఇంతలా వార్నింగ్ ఇస్తున్నా పార్టీ శ్రేణుల్లో మార్పు వస్తుందా అన్న సందేహం వ్యక్తమైంది. స్వేచ్ఛకు మారుపేరైన హస్తం పార్టీలో నిరసనలు అడ్డుకోవడం అంత ఈజీ ఏం కాదని మరికొందరు అంటున్నారు.