
సగం ఓవర్లయినా కాలేదు.. ఒక్కరూ నిలబడాలన్న ప్రయత్నమూ చేయలేదు.. ఇంకేముంది వెస్టిండీస్ కథ ముగియడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. ఫార్మాట్ మారినా వెస్టిండీస్(West Indies) ఆటతీరులో ఏ మాత్రం మార్పు లేదు. టెస్టుల తరహాలోనే వన్డేలోనూ చతికిలపడింది. బ్రిడ్జిటౌన్ లో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(52; 46 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీతో ఒక్కడే రాణించాడు. 23 ఓవర్లలో ప్రత్యర్థిని 114 రన్స్ కు ఆలౌట్ చేసిన టీమ్ ఇండియా… 22.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. స్పిన్నర్ల దాడితో 23 ఓవర్లలోనే విండీస్ లైనప్ ను కుప్పకూల్చింది. ఆ జట్టులో షాయ్ హోప్ మాత్రమే(43) ఈ మాత్రం స్కోరు సాధించాడు. అథనేజ్(22), బ్రెండన్ కింగ్(17), హెట్ మయర్(11) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా చేయకపోవడంతో విండీస్ వికెట్లు టపటపా రాలిపోయాయి. కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లతో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. పాండ్య, ముకేశ్, శార్దూల్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ సైతం టపటపా వికెట్లు సమర్పించుకుంది. ఒక ఎండ్ లో ఇషాన్ కిషన్ నిలబడగా, మరో ఎండ్ లో బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. గిల్(7), సూర్యకుమార్(19), పాండ్య(5), శార్దూల్(1) తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. రవీంద్ర జడేజా(16 నాటౌట్), రోహిత్(12 నాటౌట్) భారత్ ను గెలిపించారు. విండీస్ బౌలర్లరో గుడకేశ్ 2, కేరియా, సీల్స్ తలో వికెట్ తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0తో నిలిచింది.