రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ముఖ్యమంత్రి K.చంద్రశేఖర్ రావు మీటింగ్ నిర్వహించారు. చాలా కాలం తర్వాత గవర్నర్, CM మీటింగ్ నిర్వహించడం విశేషంగా మారింది. పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత గవర్నర్, సీఎం ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకున్నారు. చాలా కాలంగా గవర్నర్, సీఎం మధ్య వివాదం కొనసాగుతోంది. బిల్లుల విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపైనా ఇరు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమాలకు CM ఎప్పుడూ దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగ్గా.. ఆ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత గవర్నర్ తో KCR మాట్లాడారు.
అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుల్ని ఆమోదించకపోవడం, గవర్నర్ కోటాలో MLC అభ్యర్థుల నియామకంపై ప్రభుత్వం పంపిన ఫైల్ ను తిప్పి పంపడం వంటి కారణాలతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది. గవర్నర్ రాష్ట్రంలో పర్యటించే సందర్భంలోనూ కలెక్టర్లు సహా అధికార యంత్రాంగమంతా దూరంగా ఉంది. ఇక RTC విలీన బిల్లు విషయంలోనూ వివాదం చోటుచేసుకుంది. గవర్నర్ ఆ బిల్లును సంశయం పేరిట పెండింగ్ లో పెట్టడం, దాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోకపోవడం, దీనిపై మరోసారి సర్కారు వివరణతోపాటు న్యాయ సలహా కోరడం వంటివన్నీ జరగడంతో ఈ దూరం మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక ఈ ఇరువురూ చర్చలు జరిపారు. అయితే వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది తెలియాల్సి ఉంది.