ఏ ఆధారంతో ఉపాధ్యాయుల బదిలీల్లో వివక్ష చూపుతున్నారంటూ ప్రశ్నించిన హైకోర్టు… కేసు విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. టీచర్ ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా అంటూ ప్రశ్నలు సంధించింది. అయితే దంపతులు ఒకే చోట ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతమని అడిషనల్ అడ్వొకేట్ జనరల్(AAG) కోర్టుకు విన్నవించారు. ఆ కోణంలోనే ఉపాధ్యాయుల దంపతులకు అడిషనల్ పాయింట్స్ ఇచ్చినట్లు తెలిపారు. టీచర్లను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం సర్కారుకు లేదని, వారికి సౌలభ్యం ఉండేలా దంపతులకు ట్రాన్స్ ఫర్లు నిర్వహిస్తున్నామన్న అడిషనల్ AG.. కోర్టు ‘స్టే’ ఉన్నందువల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని వివరించారు. ఎలక్షన్లు వస్తున్న దృష్ట్యా విచారణను వేగవంతం చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
ట్రాన్స్ ఫర్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ను సవరించామని, ఈ నిబంధనల సవరణలను శాసనసభతోపాటు కౌన్సిల్ ముందుంచామని ప్రభుత్వం తరఫున అడిషనల్ AG వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన మార్పుల మెమోను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి అందజేశారు. అయితే మెమో, కౌంటర్లు ఇప్పుడే ఇచ్చినందున కొంత సమయం కావాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు. అటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వం తరఫున తదుపరి వాదనలు వినేందుకు కేసును ఈ నెల 23 వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలియజేసింది.