జూనియర్ పంచాయతీ సెక్రటరీ(JPS)ల రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్ల కంటిన్యూ సర్వీసులో భాగంగా పనితీరు ఆధారంగానే రెగ్యులరైజ్ చేయాలని జిల్లాల కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చింది. కేటాయించిన అంశాల్లో 70 శాతానికి పైగా స్కోరు సాధించిన వారినే రెగ్యులర్ చేయాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా మొత్తం 9,355 మంది రిక్రూట్ అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ కమిటీ నివేదిక ఆధారంగానే క్రమబద్ధీకరణ చేయాలని, అందులో కచ్చితంగా 70 శాతానికి పైగా స్కోరు చేయాలని సూచించింది. ఒకవేళ అనుకున్న మేరకు పెర్ఫార్మెన్స్ కనబరచపోతే వారిని మరో ఆరు నెలల పాటు పరిశీలనలో ఉంచాలని ఆదేశించింది.
రెగ్యులర్ అవుతున్న సిబ్బందిని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ లెవెల్-4 గా పరిగణించాలని కలెక్టర్లకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. JPSల పనితీరు, వివరాల్ని పంచాయతీరాజ్ మొబైల్ యాప్ లో నమోదు చేయాలని, వీటిని లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్లు పరిశీలించాలని స్పష్టం చేసింది.