రాజస్థాన్ విసిరిన భారీ లక్ష్యాన్ని(Target) రీచ్ అయ్యే క్రమంలో మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ప్రారంభంలోనే ప్రధాన వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సంజూ శాంసన్(82; 52 బంతుల్లో 3×4, 6×6) సిక్సర్లతో చెలరేగాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(11) తొందరగానే ఔటైనా రియాన్ పరాగ్(43; 29 బంతుల్లో 1×4, 3×6)తో కలిసి 93 పరుగుల భాగస్వామ్యం(Partnership) జోడించాడు. షిమ్రోన్ హెట్ మయర్(5) ఫెయిలైనా చివర్లో ధ్రువ్ జురెల్(20; 12 బంతుల్లో 1×4, 1×6) బ్యాట్ కు పనిచెప్పడంతో మంచి స్కోరు నమోదైంది.
ఆదిలోనే కష్టాలు…
194 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. క్వింటన్ డికాక్(4), దేవ్ దత్ పడిక్కల్(0), ఆయుష్ బదోని(1) ఇలా వచ్చి అలా వెళ్లడంతో కష్టాల్లో పడింది. రాజస్థాన్ పేసర్, న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్ విజృంభణతో డికాక్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగితే, పడిక్కల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అటు బదోనిని బర్గర్ ఔట్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా ఆదుకునే ప్రయత్నం చేసినా చివరకు హుడా(26; 13 బంతుల్లో 2×4, 2×6) చాహల్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో 60 స్కోరు వద్ద నాలుగో వికెట్ చేజార్చుకుంది.