
తిరుమల శ్రీవారు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి నిర్వహించే వాహన సేవలు, విశేష ఉత్సవాలు, ముఖ్య కార్యక్రమాల వివరాలతో బుక్ లెట్ రూపొందించారు. కాణిపాకంలో సెప్టెంబర్ 14న వినాయక చవితి రోజున ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీ వరకు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ రెండు క్షేత్రాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. తిరుమలలో ఉద్యోగులు, భక్తుల కోసం ఇప్పటిదాకా ఉన్న బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భద్రత కోసం 3 వేల మంది పోలీసులు సహా మొత్తం 5,600 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
సెప్టెంబర్ 15న సాయంత్రం మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ సేవ రోజున సాధారణ రోజుల కంటే 20 శాతం అదనంగా భక్తులు వచ్చే అవకాశముందని టీటీడీ అంచనా వేసింది.