ఇప్పటికే సొంతగడ్డ(Own Ground) ఉప్పల్ లో రెండు మ్యాచ్ లు గెలిచి.. మరో రెండింటిని ఇతర గ్రౌండ్స్(ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్)లో కోల్పోయిన హైదరాబాద్ సన్ రైజర్స్(SRH).. భాగ్యనగరం బయట తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్(PBKS)తో మొహాలీలోని ముల్లాన్ లో జరిగిన మ్యాచ్ లో సంచలన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ చేజారుతుందనుకున్న దశలో కేవలం 2 పరుగుల తేడాతో గెలుపును SRH సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ గట్టిగా పోరాడినా 6 వికెట్లకు 180 పరుగులే చేయగలిగింది.
కమిన్స్ టీమ్ లో…
ట్రావిస్ హెడ్(21), అభిషేక్ శర్మ(16), మార్ క్రమ్(0) పెద్దగా స్కోరు చేయలేదు. ముగ్గురు టాప్ బ్యాటర్లు ఔట్ కావడంతో హైదరాబాద్ డిఫెన్స్ లో పడింది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి(64; 37 బంతుల్లో 4×4, 5×6) సూపర్ బ్యాటింగ్ తో మళ్లీ లైన్లోకి వచ్చింది. కానీ రాహుల్ తిరుపతి(11), క్లాసెన్(9) క్రీజులో నిలబడలేదు. చివరకు అబ్దుల్ సమద్(25; 12 బంతుల్లో 5×4) స్పీడ్ గా ఆడటంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఆరో వికెట్ కు నితీశ్, సమద్ జోడీ 18 బాల్స్ లోనే 50 పార్ట్నర్ షిప్ అందించింది. 4 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు అర్షదీప్ సింగ్.
ఛేదనలో…
హైదరాబాద్ బౌలర్లు టైట్ గా బౌలింగ్ చేయడంతో పంజాబ్ తొలి 3 వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. ఓపెనర్లు ధావన్(14), బెయిర్ స్టో(0), ప్రభ్ సిమ్రన్(4).. ఇలా 20కే 3 వికెట్లు పడ్డాయి. శామ్ కరణ్(29), సికిందర్ రజా(28) కొద్దిసేపు నిలకడగా ఆడారు. ఆ ఇద్దరితోపాటు కీపర్ జితేష్ శర్మ(19) కూడా ఔటవడటంతో 114 స్కోరుకే 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ పరాజయం దిశగా సాగింది.
పట్టువదలకుండా…
కానీ శశాంక్(46; 25 బంతుల్లో 6×4, 1×6) ఒక పట్టాన వదలకుండా అశుతోష్ శర్మ(33; 15 బంతుల్లో 3×4, 2×6) ధనాధన్ బ్యాటింగ్ తో హైదరాబాద్ కు దడ పుట్టిస్తూ గెలిచినంత పనిచేశారు. చివరి ఓవర్లో ఒత్తిడికి గురైన పేసర్ ఉనద్కత్ 3 వైడ్లు సహా 9 బాల్స్ వేయాల్సి వచ్చింది. ఫైనల్ ఓవర్లో 29 రన్స్ కావాల్సిన పరిస్థితుల్లో 3 సిక్సర్లు సహా 26 పరుగులే వచ్చాయి.