పవన్ కల్యాణ్, అంబటి రాంబాబు వివాదం ఉగ్రరూపం దాల్చుతోంది. ‘బ్రో’ సినిమాలో తనను ఉద్దేశిస్తూ పాత్ర సృష్టించి కించపరిచారంటూ ఫైర్ అవుతున్న మంత్రి రాంబాబు.. ఈ రోజు రాత్రికి దిల్లీ వెళ్తున్నారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంప్లయింట్ ఇచ్చేందుకు ఆయన పర్యటన ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. పవన్ తాజా సినిమా వివాదం చినికి చినికి గాలివానలా తయారైంది. తనను ఉద్దేశించి పాత్ర తయారు చేశారని ఆరోపిస్తూ ఆ సినిమాకు అక్రమంగా నిధుల్ని వాడారని నిన్న మంత్రి ప్రకటించారు. పవన్ కు ఇచ్చిన రెమ్యునరేషన్ అంత కూడా సినిమా కలెక్షన్లు లేవని, ‘బ్రో’ అట్టర్ ఫ్లాప్ అంటూ విమర్శించారు. ఇవే కాకుండా పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు.
‘బ్రో’ లాగా ‘మ్రో (మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్స్)’ సినిమా తీస్తానని, సినిమా రంగంలో హీరోగా వెలిగి మూణ్నాలుగు పెళ్లిళ్లు చేసుకుని పాలిటిక్స్ కు వచ్చిన వ్యక్తి కథతో మూవీ ఉంటుందని అన్నారు. అంబటి రాంబాబు కామెంట్స్ పై నిర్మాత స్పందించారు. ‘బ్రో’ బ్లాక్ బస్టర్ మూవీ అని.. పవన్ కు ఎంతిచ్చామో అనవసరమైన వారికి చెప్పాల్సిన అవసరం లేదన్న ప్రొడ్యూసర్ టి.జి.విశ్వప్రసాద్.. నెట్ ఫ్లిక్స్, జీటీవీతో మంచి బిజినెస్ జరిగింది అంటూ స్పష్టం చేశారు. సినిమా లెక్కలపై మంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, కానీ ప్రతి దానికీ తమ వద్ద లెక్కలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర బృందాలకు కంప్లయింట్ చేసేందుకే అంబటి దిల్లీ వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎవర్ని కలిసేది ఇప్పుడే చెప్పలేనని, వచ్చాక అన్ని వివరాలు తెలియజేస్తానని రాంబాబు అంటున్నారు.