
హైదరాబాద్, భోపాల్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలో మరొకర్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ N.I.A. అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేసినట్లయింది. హిజ్బ్-ఉత్-తహ్రీర్(HuT)కి అనుబంధంగా పనిచేస్తున్న ముఠాకు సంబంధించి హైదరాబాద్ లో ఇప్పటికే N.I.A. అధికారులు సోదాలు నిర్వహించారు. పరారీలో ఉన్న సల్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మే 24న నమోదైన కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేసినట్లు N.I.A. ప్రకటించింది.
సల్మాన్ ను పట్టుకునేందుకు రెండు చోట్ల అధికారులు సోదాలు జరిపారు. ఈ దాడుల్లో హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, SD కార్డులతోపాటు డిజిటల్ ఎక్విప్ మెంట్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుడు సలీం నేతృత్వంలోని హుటీ మాడ్యుల్ లో సల్మాన్ చురుగ్గా వ్యవహరిస్తున్నాడని N.I.A. తెలిపింది. షరియత్ చట్టం మేరకు ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంగా హుటీ పనిచేస్తోందని, వీరంతా దాని సభ్యులుగా ఉంటూ ముస్లిం యువతను సంస్థలోకి చేర్చుకునేలా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. దేశాన్ని అస్థిరపరచే కుట్రలు చేస్తున్న హుటీ గ్యాంగ్ అరెస్టు వివరాల్ని N.I.A. ఒక ప్రకటనలో వివరించింది.