తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల(Employees) సర్దుబాటు(Adjustment) కోసం తెచ్చిన జీవో 317. దీనికి సంబంధించిన మార్గదర్శకాల(Guidelines)పై చాలా కాలం నంచి ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తున్నది. దీన్ని రద్దు చేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా ఈ GO పట్ల ఉపాధ్యాయుల్లో తీవ్రమైన నిరసన కనిపిస్తున్నది. కొత్త జిల్లాలు ఏర్పడ్డ వెంటనే ‘వర్క్ టూ ఆర్డర్’ కింద కొత్త జిల్లాలకు కేటాయించారే గానీ శాశ్వత నియామకాలు చేపట్టలేదు. అయితే ఈ సమస్యలు ఒక పట్టాన కొలిక్కి రాకపోవడంతో.. కాంగ్రెస్ సర్కారు దీనిపై కేబినెట్ సబ్ కమిటీ వేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఛైర్మన్ గా.. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఈ సబ్ కమిటీ పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జీవో గొడవ ఇదే…
కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలుత 2016 అక్టోబరులో 31 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన KCR సర్కారు.. 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేటల్ని సైతం నూతన జిల్లాలుగా ప్రకటించింది. ఉద్యోగుల కేటాయింపు(Allocation)లో రాష్ట్ర ప్రభుత్వం.. 2018లో కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి రావడంతో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం 2021 డిసెంబరు 6న 317 GOను జారీ చేసింది. అయితే ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయంతోనే ఆనాడు 317 జీవో ఇచ్చారని, దీనిపై ఉద్యోగసంఘాలు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.
పాత జిల్లాల నుంచి…
పాత జిల్లాల్లోని జోన్లు, మల్టీజోన్ల నుంచి.. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు అదే పాత జిల్లాల్లో భాగంగా ఉన్న జోన్లు, మల్టీజోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ఆప్షన్(Option) ఎంచుకునే అవకాశం ఇచ్చింది. ఆయా కేడర్లలో సీనియారిటీ ప్రాతిపదికగా వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులున్న వారికి ప్రత్యేక ప్రాధ్యానత కింద ఆప్షన్ ఎంచుకునే ఛాన్స్ కల్పించింది. డిమాండ్ కలిగిన చోట పోస్టులు నిండిపోగా.. సీనియారిటీ తక్కువగా ఉన్న వారికి ఆ ఆప్షన్ పనికిరాకుండా పోయింది.
స్థానిక జిల్లానే అయినా సీనియారిటీ లేని వారికి కోరుకున్న చోట పోస్టింగ్ దక్కే ఛాన్స్ లేకుండా పోయింది. టీచర్లలో నాన్-గెజిటెడ్ పోస్టులన్నీ జిల్లా కేడర్ పోస్టులయ్యాయి. వీరిలో SGTలు, స్కూల్ అసిస్టెంట్లు జిల్లా కేడర్ లో ఉన్నారు. మల్టీజోనల్, జోనల్ పోస్టుల్లో కన్నా జిల్లా కేడర్ లో సర్దుబాటుపైనే వివాదం ఏర్పడింది. సొంత జిల్లాల నుంచి వేరే జిల్లాలకు బదిలీపై వెళ్తే గతంలో.. నాలుగైదేళ్లకైనా తిరిగి సొంత జిల్లాకు వస్తామన్న ఆశ ఉండేది. కానీ కొత్త జిల్లాలకు శాశ్వత కేటాయింపులు జరపడంతో అక్కడే పరాయి వ్యక్తిగా ఉండిపోవాల్సి వస్తుందన్నది ఉద్యోగుల ఆరోపణ.
వేరే జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు తమ ప్రాంతాల్లో శాశ్వతంగా ఉంటూ చివరకు తమ స్థానికతనే దెబ్బతీస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. టీచర్లతోపాటు ఏజన్సీ ప్రాంతాల కేటాయింపులపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. మైదాన ప్రాంత ఉద్యోగులు ఏజన్సీలకు, అక్కడున్నవారు మైదాన ప్రాంతాలకు వెళ్లేలా జీవో ఉంది. ఏజన్సీల్లో పనిచేసేవారు తమ సొంత జిల్లాలకు వెళ్లాలన్నా సీనియారిటీ లేకపోవడంతో అక్కడే ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల తమకు నష్టం జరుగుతున్నదంటూ ఏజన్సీల్లోని ఉద్యోగులు కోపంతో ఉన్నారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కింద కల్పించిన హక్కులు 317 జీవో ద్వారా హరించుకుపోతున్నాయని మండిపడుతున్నారు.