న్యాయపరమైన(Legal Issues) ఆటంకాలు తొలగినా అడుగు ముందుకు పడని ఉపాధ్యాయుల బదిలీలు(Transfers), పదోన్నతుల(Promotions)పై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వీలైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేసి స్కూళ్ల ఓపెనింగ్ నాటికి ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.
CMతో భేటీ…
ముఖ్యమంత్రిని కలిసిన MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి.. టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై CM వెంటనే విద్యాశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి నిర్దిష్టమైన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రేవంత్ సూచన మేరకు MLCతోపాటు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(USPC), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) నాయకులు మధ్యాహ్నం సెక్రటేరియట్లో బుర్రా వెంకటేశంను కలిశారు.
‘టెట్’తో సంబంధం లేకుండా…
2010 ఆగస్టు 23కు ముందు నియామకమైన టీచర్లకు ‘టెట్’తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం.. అటు ప్రధానోపాధ్యాయులకు స్కూల్ మారిన సందర్భంలో మాత్రమే టెట్ అవసరమని NCTE వివరణ ఉత్తర్వులు ఇచ్చినందున ప్రమోషన్లకు గల ఆటంకాలు తొలగిపోయాయని సంఘాలు ఆయనకు గుర్తు చేశాయి.
ఈసీ అనుమతితో…
అర్థంతరంగా నిలిచిపోయిన ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని కోరడంతో ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకుని బదిలీ అయి రిలీవ్ కాని వారికి వెంటనే ఆర్డర్స్ ఇచ్చేలా చూస్తామని సెక్రటరీ హామీ ఇచ్చినట్లు యూనియన్ల నేతలు తెలిపారు. పాఠశాలలు మొదలయ్యే లోపే మోడల్ స్కూళ్లు, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో ప్రక్రియను చేపడతామని చెప్పినట్లు తెలియజేశారు.