నదుల ప్రకోపానికి పల్లె, పట్టణమనే తేడా లేకుండా అందరూ బాధితులయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగి భయానక పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఖమ్మం జిల్లాను మున్నేరు వరద ముంచెత్తితే.. APలో విజయవాడను బుడమేరు జలమయం చేసింది. ఈ రెండు నదుల ప్రవాహంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకుండా పోయాయి.
మొత్తంగా ఇరు రాష్ట్రాల్లో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు కనిపించకుండా పోయారు. తెలంగాణలో 9 మంది మృత్యువాత(Deaths) పడగా ఐదుగురు గల్లంతయ్యారు. అటు APలో 15 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బుడమేరుకు వరద ఉప్పొంగడంతో విజయవాడ 40% నీటిలో చిక్కుకుపోయింది. నగరీకరణ పేరుతో బుడమేరు కాల్వలన్నీ మూసుకుపోవడమే ఈ ఉపద్రవానికి కారణమైంది.
ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యుత్తు సప్లై దెబ్బతినడం, పంటలు నీటమునగడం, చెరువులకు గండ్లు.. రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు కూలిపోవడంతో రెండు రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. వర్షాలు తగ్గితే గానీ పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదు.