పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం(Mid Day Meals) తీరుపై నివేదికను ప్రభుత్వానికి విద్యా కమిషన్ అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారిని కలిసిన కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి.. బడుల్లోని ఆహార నాణ్యత(Food Quality)పై క్షేత్రస్థాయి రిపోర్టును అందించారు. మధ్యాహ్న భోజన ఛార్జీలు పెంచాలని, అందుకోసమయ్యే బిల్లుల్ని ప్రతి వారం చెల్లించాలని నలుగురు సభ్యుల టీమ్ తెలిపింది. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో సాయంత్రం పూట స్నాక్స్ ఇవ్వాలని, ఎక్కడికక్కడ మధ్యాహ్న భోజనం మెనూ సక్రమంగా పాటించాలని రిపోర్టులో నివేదించింది. ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండాలని, ఇతర రుసుముల్ని వసూలు చేయకుండా నియంత్రించాలంటూ ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శికి సూచించగా.. తాజాగా CSకు సైతం రిపోర్టును అందజేసింది.
ఆయా స్కూళ్ల పరిస్థితులను బట్టి వివిధ కేటగిరీలుగా(కనిష్ఠం నుంచి గరిష్ఠం) వరకు ఫీజులను విభజించాలంటూనే బుక్స్, యూనిఫామ్ వంటి వాటితో విద్యాలయాలు వ్యాపారం చేయకుండా కట్టడి చేయాలని సిఫార్సు చేసింది. రిటైర్డ్ IAS ఆకునూరి మురళి ఛైర్మన్ గా విశ్వేశ్వరరావు, వెంకటేశ్, జ్యోత్స్న సభ్యులుగా కమిషన్ ఏర్పాటైంది. ఫీజుల ఖరారు, నియంత్రణ కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఛైర్మన్ గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ IAS సహా సంబంధిత రంగాలకు చెందిన నలుగురు నిపుణుల్ని నియమించాలని సూచించింది. ప్రతి జిల్లాకో కమిటీ ఏర్పాటు చేసి ఫీజుల ఖరారు తర్వాత వచ్చే కంప్లయింట్లపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఒక్కో చోట ఫీజులు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ. 10 లక్షలకు పైగా ఉన్నట్లు పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయని అందులో స్పష్టం చేసింది.