బ్రిక్స్(Brics) దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. US డాలర్ కు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తే 100 శాతం సుంకాలు(Tariffs) విధిస్తామన్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో కూడిన బ్రిక్స్.. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త కరెన్సీ ఆలోచనలో ఉంది. ఈ దేశాలు US డాలర్ పాత్రను కొనసాగించాలని, లేదంటే ఆర్థిక పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ గుర్తు చేశారు. ‘బ్రిక్స్ దేశాలు డాలర్ కు దూరంగా ఉండే ఆలోచన ముగిసిపోయింది.. ఈ శత్రు దేశాలు బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోవు.. శక్తిమంతమైన US డాలర్ ను భర్తీ చేయడానికి మరే ఇతర కరెన్సీని తిరిగి ఇవ్వలేవు.. అలా చేస్తే 100% టారిఫ్ ల్ని భరిస్తారు.. ఎక్కడైనా, ఏ దేశమైనా ఆ తరహా ప్రయత్నం చేస్తే సుంకాలకు వెల్ కమ్ చెప్పాల్సి ఉంటుంది..’ అని ఘాటుగా హెచ్చరించారు.
ఉక్రెయిన్ పై దాడి తర్వాత రష్యాపై పాశ్చాత్య(Western) దేశాలు ఆంక్షలు విధించినా బ్రిక్స్ ఆర్థిక సహకారం పుతిన్ సర్కారుకు మరింత పెరిగింది. ఈ కొన్నేళ్లలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేషియా, ఇరాన్, UAE దేశాలకు బ్రిక్స్ విస్తరించింది. దీనికి సాధారణ కరెన్సీ లేనప్పటికీ, తమ స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని నడుపుతున్నాయి. 2023లో జరిగిన 15వ బ్రిక్స్ భేటీలో డి-డాలరైజేషన్ కు పుతిన్ పిలుపునిచ్చి, జాతీయ కరెన్సీల్లోనే సెటిల్ మెంట్లు జరగాలనడంతో ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది.