
తెలంగాణలో చేయూత పింఛన్ల(Cheyutha Pensions) పథకానికి కొత్తగా దరఖాస్తు చేసే గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే 4,34,854 అప్లికేషన్లు రాగా, డేటా ఎంట్రీ ప్రక్రియ నడుస్తోంది. ఈరోజుతో గడువు ముగుస్తుండటంతో గ్రామ పంచాయతీలు, ప్రజాపాలన సేవా కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ తయారు చేసిన అధికారిక నివేదిక ప్రకారం వచ్చిన దరఖాస్తుల్లో వితంతు పింఛన్లు 2.64 లక్షల మంది(61%)తో ప్రథమ స్థానంలో ఉండగా, దివ్యాంగులు 1.07 లక్షలతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఒంటరి మహిళలు 26 వేల మందికి పైగా, గీత కార్మికులు 26 వేలు, చేనేత కార్మికులు 10 వేల మందికి పైగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు.